కొత్త కథ 2017

అక్కిరాజు భట్టిప్రోలు – తొంభయ్యవ దశకంలో సెంట్రల్ యూనివర్సిటీ రోజుల్నుండీ పరిచయం, అటుతర్వాతి అమెరికా రోజుల్లో తనతో మంచి స్నేహం. తను కుప్పిలి పద్మ గారితో కలిసి సంకలనం చేసిన “కొత్త కథ 2017” చదివాను. చదివాను అనడం కంటే, ఏకబిగిన చదివాను అనడం కరెక్టు. కొత్త కథ 2017 లోని కథల గురించి, నా అభిప్రాయం:

బ్రదర్ ఆఫ్ బంగారి – అక్కిరాజు భట్టిప్రోలు: సమకాలీన యువతుల ఆలోచనారీతిని కళ్ళకు కట్టినట్టుగా చూపించే కథ. లక్ష్మి పాత్ర ద్వారా Good Decision, Bad Execution అన్నదాన్ని సోదాహరణంగా చెప్పినట్లుగా నాకనిపించింది.

మెలకువ ముందు కల – అరిపిరాల సత్య ప్రసాద్: రియలిజానికీ, సర్రియలిజానికీ మధ్యగా నడుస్తూ పోయిన కథ. ఎర్రదనం, మట్టి సింబాలిగ్గా కలసిన కలలాంటి కథ.

ఒక జీవితం… రెండు కలలు… – ఆకునూరి హాసన్: ప్రేమంటే సున్నితత్వమా లేదా భయపెట్టేంతలా వెల్లువెత్తే భావావేశమా అని ఆలోచింపచేసే కథ. రూప నుండి రజనీగంధ వరకూ వ్యర్ధమయిన రెండు దశాబ్దాల్లో అతను సున్నితత్వమంటే ఏమిటో తెలుసుకున్నాడని నాకనిపించింది – అతను పాప పక్కన కూర్చున్నప్పుడు.

నల్లగాలి – భగవంతం: ఒక మామూలు దినచర్య సందర్భానుసారంగా ఎలాంటి అనుభూతుల్ని కలిగిస్తుందో చెప్పే కథ. కథ ఆఖర్లో అతడు బైక్ మీద కాక ఆటోలోనో కాబ్‌లోనో వెళ్ళుంటే ఇంకా బాగుండుననిపించింది.

ఇద్దరు మంచివాళ్ళ అడల్ట్ కథ – జి. ఎస్. రామ్మోహన్: పాతికేళ్ళనుండి సాఫ్ట్‌వేర్ ఫీల్డులో ఉన్నా కొంచెం మింగుడుపడని (read మోడర్న్) సందర్భాల కథ. సుధాకర్ని చూసి గొంగళిలో అన్నం తింటూ వెంట్రుకలేరుతున్నాడేమిటిరా అనిపించిన కథ.

ఛోటి – హనీఫ్: చూపుడు వేలుకింద బొటనవేలుని పెట్టి బొటనవేలుని పైకెగరేసిన అమ్మని అర్ధం చేసుకోలేని అమ్మ కథ మనసుని కొంచెం మెలిపెట్టింది.

ఫ్రెనర్ లా విదా – కొల్లూరి సోమశేఖర్: మెటీరియలిస్టిక్ పనుల మొగుడికి, ఈస్థటిక్ భావాల పెళ్ళానికీ మధ్య నిలిచిన సాక్షి చెప్పిన మనసు కథ.

వాటర్ ఫ్రంట్ – కుప్పిలి పద్మ: ఐడియాలజీయా, ప్రాక్టికాలిటీయా అన్న ప్రశ్న వచ్చినప్పుడు? మనం ఏది ఫాలో అవుదాం, మన పక్కోడు ఏది ఫాలో అయితే బాగుంటుంది అన్న మీమాంస వచ్చినప్పుడు? పొలిటికల్ కరెక్ట్‌నెస్ ప్రాముఖ్యతను గురించి ఆలోచింపచేసిన కథ.

వెలుతురు నీడలు – కాకుమాని శ్రీనివాసరావు: హిస్టరీ రిపీట్స్ అనిపించిన కథ. ఆతడి ఫాసినేషన్ కేవలం ఆ వస్త్రధారణ పైనేనా అనికూడా అనిపించింది.

క్రీ.పూ-క్రీ.శ. – కోడూరి విజయ కుమార్: రాచరికపుకాలంనాటి కథతో వర్తమానకాలంలోని పరిస్థితులపై సునిశిత వ్యంగ్యాస్త్రం. కాకుల సంభాషణ పెదాలపై చిరునవ్వు తెప్పించింది.

తోలుబొమ్మలాట – కూనపరాజు కుమార్: మారుతున్న సామాజిక అలవాట్ల నైపధ్యంలో అంతరించిపోతున్న కళల, అలమటించిపోతున్న కళాకారుల కథ. మనలోని నిస్సహాయతను నిశ్శబ్దంగా నిలదీసే కథ.

చున్నీ – కె. వి. కరుణకుమార్: మనచుట్టూ జరుగుతున్న సంఘటనలతో మనసును మెలితిప్పిన కథ. అవును కదూ అనిపిస్తుంది.

పెన్సిల్ బాక్స్ – మహమ్మద్ ఖదీర్ బాబు: ఒక చిన్న సంఘటన కొన్ని జీవితాల్ని ఇంతలా మార్చేస్తుందా అనిపించే కథ. విశ్వనాథ్ గారు తీసిన ఆపద్భాంధవుడు గుర్తొచ్చింది.

కృష్ణ శోధ – మోహిత: భావుకత ఎక్కువగా ఉన్న చక్కని పద్యకావ్యంలో కథ ఆ వృక్షాల్లోనూ, పొదల్లోనూ, లతల్లోనూ గిరికీలు కొడుతూ ఉండిపోయింది. వారాలపై ప్రయోగాలు బావున్నాయి – శనివారాలకే ఏదో తేడాకొట్టింది రెండుసార్లూ.

ద డెడ్ మాన్ ఈజ్ గోయింగ్ టు సింగ్ – మహి బెజవాడ: ముగ్గురి జీవితాల్లోని నాలుగో మనిషి జీవితపు కాలిన కలలు. ముగ్గురికీ మూడు రకాలుగా కనిపించిన మనిషిలోని అంతర్గత శూన్యపు ఆఖరి అడుగు ఈ కథ.

సున్నాలు – మెర్సీ మార్గరెట్: కహానీ-2 సినిమా చూడకపోవటం వల్లనేమో, ఆ వెన్నాడుతున్న సున్నాల గురించి అర్ధం కాలేదు. చైల్ద్ అబ్యూస్ పైన ఒక నిజాయితీ అయిన కథ.

మట్టి గోడలు – నాగేంద్ర కాశీ: భూసేకరణ బాధితుల జీవితాల్లోని చీకటి కోణాల కథ. మట్టిని ప్రేమించేవాడి మనస్తత్వాని గురించి బాగా రాసారు.

శ్రీమతి సర్టిఫికేట్ – పూడూరి రాజిరెడ్డి: కామాలే తప్ప ఫుల్లుస్టాపుల్లేని ఒకానొక ఉదయపు బిజీ జీవితంలోంచి ఊడిపడ్డ చురుక్కు హాస్యం. గది ఎంత పెద్దదో ఊడ్చినప్పుడే తెలుస్తుందనేలా…

వికృతి – రాధిక: అడాలిసెంట్ వయసులోని మనసు పోకడల చిత్రీకరణ. బాహ్య సౌందర్యానికీ అంతర్గత సౌందర్యానికీ సంబంధం లేదని తెలుసుకున్న మనిషి మనసు కథ యిది.

UNKNOWN – సురేష్: భయానక, భీభత్స రసప్రధానంగా సాగిన థ్రిల్లర్. పాత్రలన్నీ మనకు తెలిసిన unknown లే అవటంవల్ల సంభాషణలు ఫాలో అవడానికి కొంచెం కష్టపడాలి.

కొన్న తల్లి – సింహాద్రి నాగశిరీష: చీకటి బతుకుల్లోని గొలుసుకట్టును ఎవరో ఒకరు తెంపినప్పుడు వచ్చిన వెలుగు రేఖ.

స్కూపీ – శాంతిశ్రీ: భావోద్వేగాలను శోషించే దారులు మూసుకుపోయిన చిన్నారి ఆక్రోశానికి ముగింపు ఏమిటి. చిన్ని కుటుంబాల్లోని మానసిక కల్లోలాలని చూపించిన కథ.

ఓ హెన్రీ స్టోరీ – వెంకట్ సిద్దార్థ: మన కళ్ళెదురుగా మూగప్రేమలను చూడటం ఆ ప్రేమించడం కన్నా కష్టమేమో అనిపించే కథ.

చివరాఖరి ముచ్చట్లు – కొత్తకథ 2017 లో నాకు నచ్చిన వాక్యాలలో కొన్ని:

  • బ్రదర్ ఆఫ్ బంగారి – “రాత్రి సంసారానికి ఆనవాళ్ళు లేవని నమ్మకం కలిగాక”
  • ఒక జీవితం… రెండు కలలు… – “కళ్ళతో నవ్విన రజనీగంధని పెదవులతో నవ్వి పలకరించి”
  • చున్నీ – “శరీరానికి ముఖం ఉంటేనే మచ్చ”, “అందుకే ఆమె చున్నీని రీఇన్వెంట్ చేసింది”
  • కృష్ణ శోధ – “ఆలస్యమయితేనేం, అమృతం అయినప్పుడు”
  • మట్టి గోడలు – “ఓ పక్షం రోజులు అల్లరైనా గానీ ప్రజాస్వామ్యమే గెలిచింది. ప్రజలు ఓడిపోయారు”

మొత్తమ్మీద కొత్తకథ – 2017 ఒక మంచి కథాసంకలనం. మనం కొనడానికి వెచ్చించిన మూల్యానికీ, చదవడానికి వెచ్చించిన సమయానికీ కూడా న్యాయం జరుగుతుంది.

కొసమెరుపు: కొత్తకథ-2017 లోని కుప్పిలి పద్మగారి వాటర్ ఫ్రంట్ కథకు ఒకటో అధ్యాయమే ఉంది, రెండవది లేదు. అప్పటికే పదిహేడు పేజీల కథ అయింది. బాహుబలి సినిమాను విభజించిన ప్రేరణతో రెండో అధ్యాయం కొత్తకథ-2018 లో రాస్తారేమో.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.