అల్లప్పచ్చడి (అల్లం పచ్చడి) వాడకంలో నేను అసలు సిసలు తెలుగు వాడిని. అల్లప్పచ్చడి అంటే హోటళ్ళలొ తెల్ల చట్నీతో పాటు ఇచ్చే ఎర్ర చట్నీ అనుకునేరు. నేను చెప్పేది మామూలుగా మనం సంవత్సరానికోసారి పట్టుకునే అల్లప్పచ్చడి గురించి. ఆ గట్టి అల్లప్పచ్చడిలో కొద్దిగా మంచినీళ్ళు గానీ, పెరుగు గానీ కలిపి ఎలాంటి ఫలహారాల్లోనయినా నంజుకుని తినే విషయంలో నేను అసలు సిసలు తెలుగువాడినన్నమాట. మనలో మనమాట, ఇడ్లీల్లోనూ దోశల్లోనూ అల్లప్పచ్చడి భేషుగ్గా ఉంటుంది. పెసరట్టు ఉప్మాలో అయితే మరీ భేషుగ్గా ఉంటుంది. శ్రీకృష్ణదేవరాయల పక్కన తెనాలి రామలింగడు ఉన్నప్పటి మజానే పెసరట్టు ఉప్మా పక్కన అల్లప్పచ్చడి ఉన్నప్పుడు వస్తుందన్నది నా ప్రగాఢ విశ్వాసం.
గతవారంలో ఒకరోజు సాయంత్రం అత్యవసర పనులన్నీ చక్కబెట్టుకుని (ఆఫీసు మెయిల్సు, స్వంత మెయిల్సు, ఫేసుబుక్కూ, ట్విట్టరూ వగయిరాలు చక్కబెట్టుకుని అన్నమాట) కొంచెం ఫలహారం తినే పనిలో పడ్డాను. ఎదురుగా మాంచి పసందుగా క్రిస్పీ చికెను వింగ్సు కనిపించాయి. వాటితోపాటు నంజుకోవటానికి సహజ సిద్దమయిన బార్బీక్యూ సాసు కూడా ఉంది. కానీ తిండి విషయంలో ప్రయోగాలు చెయ్యకపోతే మనం మనమెందుకవుతాము. అటూ ఇటూ చూసి ఎదురుగా కనపడ్డ అల్లప్పచ్చడిని మనదయిన రీతిలో పలచగా (ఇంచుమించుగా బార్బీక్యూ సాసులా కనపడేలా) కలిపాను. సోఫాలో చేరగిలబడి కాళ్ళు టేబులుపై పెట్టుకుని టీవీ చూస్తూ ఫలహారానికి ఉపక్రమించాను. అల్లప్పచ్చడిలో ఒక చికెను వింగుని బాగా తిప్పి నోట్లో పెట్టుకోగానే అప్రయత్నంగా “మహాప్రభో” అనిపించింది.
ఈ “మహాప్రభో” వెనుక ఒక విషయం ఉంది. శుభసంకల్పం సినిమాలో రాయుడు పాత్ర వేసిన కళాతపస్వి విశ్వనాధ్ గారు ఒక సన్నివేశంలో దాసు (కమల హాసన్) చేసిన చేపల పులుసు రుచి గురించి చెబుతూ “మహాప్రభో” అంటాడు. ఆ సినిమా చూసినప్పటినుండీ ఏ తిండి పదార్ధం చాలా బాగున్నా నాకు మహాప్రభో అనిపిస్తుంది.
అలా మహాప్రభో అనిపింపచేసిన చికెను వింగ్సూ అల్లప్పచ్చడి కాంబినేషను ఫలహారం క్షణాల్లో ఖాళీ అయిపోయిందని వేరే చెప్పక్కర్లేదనుకుంటాను. మీకుగనక ఇలాంటి ప్రయోగాలు ఇష్టమయితే మీరు కూడా ప్రయత్నించండి.