[ ఇది యధార్ధ సంఘటన. కల్పితం కాదు. ]
ఈ రోజు ఉదయం సుమారు అయిదు గంటల సమయం. సంజీవరెడ్డి నగర్ నుండి అమీర్‌పేట్ మీదుగా సైకిలు తొక్కుకుంటూ వెళుతున్నాను. వంటిపై నీలం, తెలుపు రంగులు కలిసిన జెర్సి, తలపై రెఫ్లెక్టివ్ హెల్మెట్, చేతికి పాడెడ్ గ్లవ్‌లు, కాలికి ట్రయినింగ్ బూట్లు, వెరసి విశ్వనాథ సత్యన్నారాయణగారి వ్యాకరణబద్ధమయిన వాక్యాలలా ఉంది నా సైకిలు తొక్కే వేషధారణ. విద్యుత్తు వాడకం తగ్గించే ప్రణాళికలో భాగంగా కిరణ్ కుమార్ రెడ్డిగారికి సహాయపడుతూ వీధి దీపాలు అంతకు కొన్ని నిముషాలకు ముందే ఆరిపోయాయి. నా సైకిలుకి ఉన్న ఎల్ఈడీ లైట్లు, దారిన పోయే వాహనాల హెడ్‌లైట్లు తప్ప రోడ్డు అంతా చీకటిగా ఉంది.
అలాంటి సమయంలో ఒకానొక విషయం వల్ల రోడ్డు పక్కన ఆగి ఎవరితోనో మాట్లాడుతుండగా ఒక ఆటోవాలా నా పక్కన ఆగాడు. నాతో “వాడ్డూయూ వాంట్” అంటూ ఇంగ్లీషులో సంభాషించే ప్రయత్నం మొదలెట్టాడు. ఒక రెండు మూడు వాక్యాల ఇంగ్లీషు సంభాషణా ప్రయత్నం తరువాత నాకు అర్ధమయిందేమిటంటే వాడు నేను తెలుగువాడిని కాదని అనుకుంటున్నాడు. సైకిలు తొక్కుతూ హెల్మెట్ వగైరాలు పెట్టుకునేవాడు తెలుగోడు (కొండొకచో భారతీయుడు) అయి ఉండడని వాడి గట్టి నమ్మకం అయి ఉంటుంది. ఆ తరువాత వాడితో తెలుగులో మాట్లాడడం మొదలెట్టాను. అప్పటికి కూడా వాడు నావంక అపనమ్మకంతో చూడడం మానలేదు. ఆఖరుకు వాడితో హైద్రాబాదీ హిందీలో మాట్లాడిన తరువాత నేను తెలుగోడిననే నమ్మకం వాడికి కలిగి వాడి దారిన వాడు వెళ్ళిపోయాడు.