ఈ వారం స్వాతి వారపత్రికలో ముళ్ళపూడి అనూరాధగారి తోక కొమ్మచ్చి ఒక అనుకోని ఆహ్లాదం (టెల్గూలో ప్లెజంట్ సర్ప్రయిజు అన్నమాట.) పూర్వీకుల ప్రస్తావనలు మెండుగా ఉన్న కోతికొమ్మచ్చిలో అనువంశీకుల ప్రస్తావనలు అస్సలు లేవు – రమణగారి ఉద్దేశపూర్వకంగానేనేమో. అనూరాధగారు తెలుగు సరిగా రాదంటూనే తెలుగువారి కలికితురాయి రాతలని మళ్ళీ గుర్తుచేసారు. కోతులతోటలో తోకలెక్కువగా ఉండటంవల్ల కొన్ని పేరాలు మళ్ళీ మళ్ళీ చదివి సంబంధబాంధవ్యాలను అర్ధంచేసుకోవలసి వచ్చింది. పునఃపఠనం ఆహ్లాదానందకారకం.
మొదటి సంపాదన చెక్కుని ఎక్కువడబ్బులకి ఎక్స్ఛేంజీ తీసుకుందామనుకున్న తండ్రీ, సర్టిఫికేట్లను ఫొటోలు కట్టించి షీల్డులపక్కన పెట్టిన తండ్రీ కలిసి గుండెను తడిపారు. స్నేహితుడికి కూరలు తీసిఉంచడాలూ, డ్రైవరు సమయానికి భోంచేయలేదని అలగడాలూ మానవసంబంధాల మునుపటి కోణాలు. గోల్డ్స్‌కి పుట్టిన కూతురు గోల్డ్‌స్పాట్ కావటం డార్విన్‌ని అబ్బురపరచగల ప్రకృతిసిధ్ధ పరిణామం.
సందర్భానుసారంగా ఉన్న బాపు పొదుపుగీతలు రాతల భావాన్ని ఇనుమడింపజేసాయి. పాదాలు చూసి ఫ్లాటయ్యి పారాణి గీయడం, గాడిద చెవులు, కషాయం గరాటు, లేడీసు పాలిటిక్సు వగైరాలు దేనికవే.
తెలుగూస్ అయిఉండికూడా తెలుగులో వ్రాసిన అనూరాధగారికి ధన్యవాదాలు. మా మంచి కోతులకి మహమంచి తోకలు…