అమ్ములపొదిలోని అస్త్రాలని ఒక్కటొక్కటిగా నిర్వీర్యం చేస్తూ వచ్చారు మన దొరవారూ, ఆచార్యులవారూను. ఇక మిగిలింది నిరాహారాస్త్రమే.
తెగేదాకా లాగకూడదని మనవాళ్ళకి కొంచెం ఆలస్యంగా తెలివయింది. ఆసరికే కార్మికులూ, రవాణా ఉద్యోగులూ, విద్యార్ధులూ, మిగతా ఉద్యోగులూ ఎవరి దారిన వాళ్ళు వెళ్ళడం మొదలెట్టారు. మూడు రోజుల రైలు రోకో జ్ఞానోదయ ప్రసాదిని అయింది. మన పోలీసులయితే మనవాళ్ళే కదా అని కొంచెం మెత్తగానే ఉంటారు కానీ రైల్వే పోలీసులు బిగిస్తే మన కొవ్వు కరిగి కండ నలుగుతుంది.
ఏసీ రూముల్లో కూర్చుని రైలు రోకోని పర్యవేక్షించగల మనవాళ్ళకి బస్సులులేక ఆటోలల్లొ నలుగుతున్న ప్రజల నాడిని తెలుసుకోవడం కొంచెం కష్టమయింది. సమ్మెలో రాళ్ళు విసిరేవాళ్ళకి బిర్యానీ పేకెట్లు ఇవ్వగలరేమోకానీ ఇంట్లోని పొయ్యిలో పిల్లి లేవక పిల్లలు పస్తులున్నపుడు ఆసరా కాలేరుకదా. సకలజనులకి ఒళ్ళు మండి సమ్మె వికలమయ్యిందందుకే.
రాజీనామాస్త్రం మొన్న మొన్నటిదాకా ప్రత్యర్ధులకు భయం కలిగించినా, మొన్నటి ఉప ఎన్నికవల్ల ఆ అస్త్రం వికటించిందన్న ఆందోళన కూడా మొదలయింది.
ఇక మిగిలింది నిరాహారాస్త్రం. వాడి రెండేళ్ళయిన ఈ అస్త్రానికి ఇంకా వాడి బాగానే ఉండి ఉంటుంది. కార్తీకమాస ఉపవాసాలకి పుణ్యం కూడా వస్తుంది. మన పిచ్చుకదొరవారు ఈ బ్రహ్మాస్త్రాన్ని ఎక్కుపెడతారేమో చూద్దాం.