గత వారం రోజులకు పైగా కారులో శ్రీ రామ రాజ్యం పాటలు వింటున్నాను. ఎన్ని సార్లు విన్నా ఇంకా వినాలనిపించే ఈ పాటల గురించి నా మాటల్లో:
- జగదానందకారకా: బాలు, శ్రేయాఘోషల్ పాడిన ఈ పాట శ్రీరాముని అయోధ్యాగమనాన్ని కళ్ళకు కట్టినట్ట్లు చూపిస్తుంది. ఈనాటి మన తెలుగు చిత్రాలలొ ‘కర్టెన్ రైజర్’ (డిస్నీ వారి లయన్ కింగ్ లో సర్కిల్ ఆఫ్ లైఫ్ వంటివి) పాటలు చాలా అరుదు. అలాంటి అరుదయిన ఈ పాట విన్నకొద్దీ మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది. “రాజ్యమేలమని ధర్మదేవతే రాగమాల పాడే…” అన్న భావం బాగుంది. “రామనామమే అమృతం, శ్రీరామకీర్తనం సుకృతం” అంటున్నప్పుడు బాలు స్వరం ముమ్మాటికీ అమృతమే. లవకుశలోని “జయ జయ రామ”, “రామన్న రాముడు, కోదండ రాముడు, శ్రీరామచంద్రుడు వచ్చాడురా, సీతమ్మ తల్లితో వచ్చాడురా” అన్న పాటల్లోని భావాల సంగమం ఈ పాట.
- ఎవడున్నాడీ లోకంలో: ఈ బాలు పాటలో చంద్రమోహన్ మాటలుకూడా ఉన్నాయి. శ్రీరాముని గుణగణాలను కీర్తించే ఈ నిముషమున్నర పాట వినదగ్గది.
- సీతారామ చరితం: అనిత, కీర్తనల గళాలతోని ఈ పాటలొ వనవాసంనుండి అగ్నిప్రవేశం వరకూ కల ఘట్టాలు ఉన్నాయి. ఆరున్నర నిముషాల ఈ పాటలో పదాల కూర్పు (తక్కువ పదాలలో ఎక్కువ సన్నివేశాలుండేలా) చాలా బాగుంది. లవకుశలోని “శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా” పాటవంటిదే ఇది.
- శ్రీరామా లేరా ఓ రామా, ఇలలో పెనుచీకటి మాపగ రా: శ్రేయాఘోషల్, రాము పాడిన ఈ పాటలో ఇళయరాజా ఆధునిక వాయిద్యాలు వాడడంతో కొంచెం వింతగా మొదలవుతుంది. కాని కొద్దిసేపట్లోనే గాత్రం వాయిద్యాలను అధిగమించి మనల్ని కట్టిపడేష్తుంది. రెండో చరణం నుండి ఈ పాట సీతారాముల అనురాగాన్ని, అనుబంధాన్ని చూపుతుంది. మచ్చుకి కొన్ని పదాలు: “హరికే హరిచందన బంధనమా”, “శ్రీరాముడు రసవేదం, శ్రీజానకి అనువాదం”
- దేవుళ్ళే మెచ్చింది: క్రితం జన్మలో చిత్ర, శ్రేయాఘోషల్ కవలపిల్లలై ఉండాలి. మొదట ఈ పాట వింటున్నప్పుడు ఎవరి గొంతు ఎక్కడ పాడిందో కనిపెట్టాలని చాలా వృథాప్రయత్నాలు చేసాను. తరువాత ఆ ప్రయత్నాలు కట్టిపెట్టి ఈ పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదిస్తున్నాను. “శివథనువదిగో, నవవధువిదిగో”, పాట రాసిన జొన్నవిత్తులగారూ, మా అభినందనలివిగో. ఈ పాటలో శ్రీరామ జననం నుండి సీతారామ కళ్యాణం వరకూ ఉన్న ఘట్టాలు వస్తాయి. ఈ పాటలోని తెలుగు పదాల ఉఛ్ఛారణ వర్థమాన గాయకులకు నిఘంటువులా పనికొస్తుంది.
- గాలీ, నింగీ, నీరూ, భూమీ, నిప్పూ మీరూ: లవకుశలోని “ఏ నిమిషానికి ఏమి జరుగునో” లో ఘంటసాల గొంతు ఆవేదనను చూపిస్తే, ఈ పాటలో బాలు గొంతు ఆక్రోశాన్ని చూపించింది. పంచభూతాలూ వద్దనలేదేమని అడుగుతూ మొదలెట్టిన ఈ పాటలో బాలు గళవిశ్వరూపం వినిపిస్తుంది. హెచ్చు తగ్గు స్వరాల మధ్యలో గుండెల్ని పెట్టి పిండడం ఆయనకో మంచి అలవాటు. మనకో మంచి అనుభూతి. ఈ పదాల్ని ఆయన పాడిన తీరు అత్యద్భుతం – “రారే మునులూ ఋషులూ, ఏమైరీ వేదాంతులూ”, “సెలయేరూ సరయూ నదీ”, “రామా, వద్దనలేదా”, “విధినైనాకానీ ఎదిరించేవాడే, విధిలేక నేడూ, విలపించినాడే”, “ఈ రక్కసి విధికీ చిక్కిందా”.
- రామాయణము, శ్రీ రామాయణము: “వినుడు వినుడు రామాయణ గాథ” కు నేటి సేత ఈ పాట. చిత్ర, శ్రేయాఘోషల్ ఈ పాట పాడారు. చాలా బాగుంది.
- సీతా సీమంతం: శ్రేయాఘోషల్ పాడిన ఈ పాట రెండు వేర్వేరు స్థాయిల్లో వస్తుంది. రెండురకాలుగానూ ఈ పాట బాగుంది.
- రామ రామ రామ అనే రాజమందిరం: శ్వేత, అనిత పాడిన ఈ పాట బాలరాముని చేష్టల్ని గురించి లవకుశులు చెబుతున్నట్టుగా ఉంటుంది. మనకు చిరపరిచయమైన అద్దంలో చందమామతో పాటు భవిష్యత్తుకి సంకేతంగా కోతుల్ని, ఉడతల్ని, ఎంగిలి పళ్ళని చేర్చారు. సరదాగా చాలాసార్లు వినదగ్గ పాట ఇది.
- కలయా నిజమా: ఆంజనేయుని వేదనను చూపించే ఈ పాటను టిప్పు పాడారు.
- ఇది పట్టాభిరాముని ఏనుగురా: కోలాటం పాట వరుసలో ఉన్న ఈ పాటను శ్వేత పాడారు. ఈ పాటలో మన ఒక తెలుగు మాండలీకం ఛాయ బాగా కనపడుతుంది. ఈ పాటను ఎడిట్ చేసినవాళ్ళు ఇంకో విడి పాట (ఇదే బాణీకి ఇదే శ్వేత పాడిన) “శంఖు చక్రాలు పోలిన కూనలారా” ను కత్తిరించడం మర్చిపోయారు. రెండు పాటలూ మరల మరలా వినదగ్గవి. కూనిరాగం తీయదగ్గవి.
- సప్తాశ్వరథమారూఢం: బాలు పాడిన మంగళ శ్లోకం ఇది.
- మంగళము రామునకు: అనిత, కీర్తన పాడిన మంగళ గీతం ఇది.
క్లుప్తంగా చెప్పాలంటే – ఇళయరాజా సుస్వరాల పాటలు. బాలు వగైరాల గొంతుల్లోంచి మన గుండెల్లోకి వచ్చే పాటలు. రమణ మనమధ్య లేనప్పటికీ, తన ప్రభావం పుష్కలంగా ఉన్న పాటలు. బాపు మార్కు పాటలు. మన తెలుగువాళ్ళం కొని వినవలసిన పాటలివి. జయ శ్రీరామ.
Very Nice post, I liked it. I will defiantly share it with my friends on Facebook. thanks again.